నాకు బీఆర్‌ఎస్‌లో అన్యాయం జరిగింది.. అందుకే కాంగ్రెస్‌లో చేరా: శ్రీకాంతాచారి తల్లి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మే 13న లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌కు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

By అంజి  Published on  9 May 2024 12:56 PM GMT
Telangana, Srikantha Chary, BRS,  Congress, Shankaramma

నాకు బీఆర్‌ఎస్‌లో అన్యాయం జరిగింది.. అందుకే కాంగ్రెస్‌లో చేరా: శ్రీకాంతాచారి తల్లి

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మాజీ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మే 13న లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌కు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మే 9వ తేదీ గురువారం గాంధీభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుడు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. లోక్‌సభ ఎన్నికలకు భువనగిరి పార్లమెంటరీ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా ఉండాలన్న తన కోరికను పార్టీ తిరస్కరించడంతో శంకరమ్మ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.

2014లో హుజూర్‌నగర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన ఆమె.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పోటీ పడి రన్నరప్‌గా నిలిచారు. కాంగ్రెస్‌లో చేరిక అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారని అన్నారు. ''శంకరమ్మ బీఆర్‌ఎస్‌లో ఎంతో కాలంగా ఉంది. హుజూర్‌నగర్‌లో ఆమె నాపై పోటీ చేసినా మేం ఎప్పుడూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకోలేదు. ఇప్పుడు హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ ఖాళీ అయింది'' అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

నాకు బీఆర్‌ఎస్‌లో అన్యాయం: శంకరమ్మ

ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి మృతిని చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. అందరూ కాంగ్రెస్‌కే ఓటు వేయాలి అని ఆమె అన్నారు.

శ్రీకాంతాచారి మరణం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన నల్గొండ విద్యార్థి శ్రీకాంతా చారి. 2009లో ఆయన ఆత్మాహుతి చేసుకోవడం తెలంగాణ రాష్ట్ర సాధన ఆందోళనలో కీలక ఘట్టం, ఇది మరింత నిరసనలకు దారి తీసి ఉద్యమ తీవ్రతకు దారితీసింది. ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణను విభజించడం కోసం చారి త్యాగం, అనేక ఇతర వ్యక్తుల త్యాగం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది.

ఆయన తల్లి శంకరమ్మ తన కుమారుడి త్యాగాన్ని మరువరాదని, రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇళ్ల స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక డిమాండ్ చేసింది.

Next Story