తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం : కేటీఆర్‌

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు శనివారం జరిగాయి. వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ జెండాను ఎగురవేశారు

By Medi Samrat  Published on  27 April 2024 8:00 AM GMT
తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం : కేటీఆర్‌

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు శనివారం జరిగాయి. వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో బీఆర్‌ఎస్ వినిపించిందని చెప్పారు.

తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సహకారమయిందని, పార్టీ తరఫున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరికీ, తమకు మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోమనేలా తమ ప్రస్థానం సాగుతుందని, భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక గొంతుక ఉండటం అవసరమని.. తెలంగాణకంటూ ఉన్న ఒక ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడించారు.

సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్‌దే అని 2014లో తమ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు. తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు అద్భుతమైన స్పందన లభించిందని వెల్లడించారు. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని చెప్పారు.

Next Story