ఏపీలో పట్టాదారు పాస్‌పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు?: పవన్ కల్యాణ్‌

కోనసీమ జిల్లా మండపేటలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  1 May 2024 10:40 AM GMT
janasena, pawan kalyan, cm jagan, ycp government ,

ఏపీలో పట్టాదారు పాస్‌పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు?: పవన్ కల్యాణ్‌

కోనసీమ జిల్లా మండపేటలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ గురించి పవన్ కల్యాణ్‌ ప్రస్తావించారు. వైసీపీకి ప్రజలు ఓటు వేస్తే.. మన ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని అన్నారు. ఎప్పుడు.. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి దోచుకెళ్తారో తెలియని పరిస్థితులు దాపురిస్తాయని పవన్ అన్నారు. అసలు ప్రజల ఆస్తి పత్రాలపై జగన్‌ హక్కు ఏంటి? ఇదే విషయాన్ని ప్రజలు జగన్‌ను నిలదీసి ప్రశ్నించాలని పవన్ కల్యాణ్‌ పిలుపు ఇచ్చారు.

అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వం తీరుపై కూడా పవన్ కల్యాణ్‌ విమర్శలు చేశారు. భారత పాస్‌పోర్టుపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉండదని చెప్పారు. కానీ.. ఏపీలో పట్టాదారు పాస్‌పుస్తకాలపై మాత్రం సీఎం జగన్‌ తన బొమ్మను ఎందుకు వేయించుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలని పవన్ కల్యాణ్‌ చెప్పారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఉన్న ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలన్నదే తన బలమైన ఆకాంక్ష అన్నారు. గత పదేళ్ల నుంచి తనను కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారని పవన్ కల్యాణ్‌ చెప్పారు.

ప్రజల కోసం ఎవరైనా సరే.. ఎంతమాట అన్నాకూడా భరిస్తానని పవన్ కల్యాణ్‌ చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులను అయినా ఎదుర్కొంటానన్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదనీ.. ప్రజలకు సేవ చేసేందుకు.. న్యాయం అందేలా పోరాటం చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు. అయితే.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందాలంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలని పిలుపునిచ్చారు. అందుకు ఓటు చీలకూడదనీ.. ప్రజలే గెలవాలని అన్నారు. వైసీపీ నాయకుల అవినీతి కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Next Story