ఒకేసారి 300 మంది సిక్‌ లీవ్‌లు.. రాత్రికి రాత్రే 80 విమానాలు రద్దు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు విమానాలు రద్దు అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  8 May 2024 6:47 AM GMT
air india express, 80 flights, cancelled,

 ఒకేసారి 300 మంది సిక్‌ లీవ్‌లు.. రాత్రికి రాత్రే 80 విమానాలు రద్దు 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు విమానాలు రద్దు అయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమానాల వరకు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన దాదాపు 300 మంది సిబ్బంది ఒకేసారి సిక్‌ లీవ్‌లు పెట్టారట. దాంతో.. 80 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఒకేసారి ఇన్ని విమాన సర్వీసులు రద్దు కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఏఐఎస్‌ కనెక్ట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విలీన ప్రక్రియ కొంతకాలం ముందు ప్రారంభం అయ్యింది. దాంతో.. సిబ్బంది పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారని తెలుస్తోంది. ఇదే విసయాన్ని గత నెల కంపెనీ దృష్టికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తీసుకెళ్లింది. సిబ్బందిలో అందరినీ సమానంగా చూడటం లేదని ఫిర్యాదు చేశారు. ఇలా వ్యవహరించడం ద్వారా తమని అవమానించడంతో పాటుగా తమ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్లు ఉందని చెప్పారు. దాంతో.. క్యాబిన్‌ క్రూలోని ఒక వర్గం అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంస్థలోని పలు విధివిధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ 300 మంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కానీ.. లీవ్‌లు మాత్రం అనారోగ్యంగా ఉందని రాసిచ్చారని తెలిపాయి.

ఇక ఉన్నట్లుండి విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రయాణికులకు కలిగిన ఇబ్బంది, వారి ఫిర్యాదులపై సంస్థ కూడా స్పందించింది. ఈమేరకు వారికి క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక లేదంటే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు సెలవులపై వెళ్లిన సిబ్బందిని సంప్రదిస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

Next Story