Hyderabad: ఎక్కడ చూసినా బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు.. కనీసం కనిపించని పారిశుధ్యం

హిమాయత్‌నగర్ ప్రాంతంలో తెలంగాణ ఆహార భద్రతా శాఖ ఇటీవల జరిపిన తనిఖీల్లో ప్రసిద్ధ ఫుడ్ కోర్ట్ లలో భయంకరమైన పరిశుభ్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 May 2024 11:52 AM GMT
Hyderabad, live cockroaches, Clove,  Creamstone, Himayathnagar

Hyderabad: ఎక్కడ చూసినా బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు.. కనీసం కనిపించని పారిశుధ్యం  

రద్దీగా ఉండే హిమాయత్‌నగర్ ప్రాంతంలో తెలంగాణ ఆహార భద్రతా శాఖ ఇటీవల జరిపిన తనిఖీల్లో ప్రసిద్ధ క్రీమ్‌స్టోన్ ఐస్ క్రీం స్టోర్, క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్‌తో సహా అనేక ఫుడ్ కోర్ట్ లలో భయంకరమైన పరిశుభ్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్

తనిఖీ సమయంలో.. చీజ్, సిరప్, సుగంధ ద్రవ్యాలు, శాండ్‌విచ్ బ్రెడ్, బ్రౌన్ షుగర్ వంటి ఉత్పత్తుల ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని కూడా కనుగొన్నారు. ఐస్‌క్రీంను నిల్వ చేసే యూనిట్‌లో బతికి ఉన్న బొద్దింకలు కనిపించాయి. దీంతో పారిశుద్ధ్యం మీద కనీస దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం, “క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్‌లో గడువు ముగిసిన ఉత్పత్తులు ఉన్నాయి. బొద్దింకలు కూడా ఉన్నాయి, అపరిశుభ్రమైన పరిస్థితులు ఉన్నాయి. నోటీసులు జారీ చేశాము." అని తెలిపారు.

క్రీమ్‌స్టోన్ అవుట్‌లెట్

క్రీమ్‌స్టోన్ ఐస్ క్రీం స్టోర్‌లో కూడా ఇలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు గమనించారు. స్ట్రాబెర్రీ పేస్ట్ గడువు ముగిసిన స్టాక్ ను కూడా కనుగొన్నారు. పైనాపిల్ టిట్‌బిట్ క్యాన్‌లను నిల్వ చేశారు. కేకులు, పేస్ట్రీల విషయంలో కూడా సరైన తేదీలు ఉంచకుండా అమ్మకానికి పెట్టారని కనుగొన్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రకటనలో “ఆహార భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు క్రీమ్‌స్టోన్ అవుట్‌లెట్‌ కు నోటీసులు జారీ చేశాము. తగిన చర్యలు తీసుకుంటాము” అని పేర్కొంది.

మోజమ్ జాహీ మార్కెట్ ఏరియాలో తనిఖీలు

ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ విభాగం మోజ్జామ్ జాహీ మార్కెట్ ప్రాంతంలో కూడా తనిఖీలు నిర్వహించింది. పలు ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు.

బిలాల్ ఐస్ క్రీమ్: ఔట్‌లెట్, తయారీ యూనిట్ ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్స్ లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అదనంగా, నకిలీ బ్రాండ్ వాటర్ బాటిల్స్ ను కనుగొన్నారు. నోటీసులు జారీ చేశామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.

కరాచీ బేకరీ: కరాచీ బేకరీలో రూ.5,200 విలువైన వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉన్నట్లు తేలింది. FSSAI నిబంధనలను ఉల్లంఘిస్తూ, పేస్ట్రీలు, కేక్‌లపై తయారీ-ఎక్స్ పైరీ తేదీలు ఉంచలేదు. FSSAI చట్టాన్ని ఉల్లంఘిస్తూ అనేక లేబుల్ లేని ఉత్పత్తులు కూడా కనుగొన్నారు.

ఆహార భద్రతా విభాగం స్పందించింది. “కరాచీ బేకరీలో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. ఇవి తీవ్రమైన ఆందోళన కలిగిస్తాయి. మేము ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము." అని అధికారులు తెలిపారు.

Next Story